టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కెనడా కెప్టెన్‌పై ఐసీసీ విచారణ!

  • కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు
  • కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఓవర్‌పై ఐసీసీ ఏసీయూ విచారణ
  • ఒక డాక్యుమెంటరీ ద్వారా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన వైనం
  • కెనడా క్రికెట్ బోర్డుపై మరికొన్ని అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు
క్రికెట్ ప్రపంచాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ భూతం మరోసారి వణికిస్తోంది. తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కెనడా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కెనడా జట్టు ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించిందని, దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ ప్రారంభించిందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో తన కథనంలో వెల్లడించింది.

కెనడాకు చెందిన ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ అనే ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్.. ‘కరప్షన్, క్రైమ్ అండ్ క్రికెట్’ పేరుతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీ ఈ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెనడా జట్టు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా బౌలింగ్ చేసిన ఒక ఓవర్‌పై ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బౌలింగ్‌కు దిగిన కెనడా పేసర్లు తొలి రెండు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చారు. మూడో ఓవర్ వేసిన స్పిన్నర్ సాద్ బిన్ జాఫర్ వికెట్ తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ ఓవర్ పూర్తి చేశాడు. ఇలాంటి కీలక సమయంలో ఐదో ఓవర్ వేయడానికి కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా స్వయంగా బంతిని అందుకున్నాడు. ఆ ఓవర్లో ఒక నో-బాల్, రెండు వైడ్లతో సహా ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఆ ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ.

కేవలం ఈ ఒక్క ఆరోపణే కాకుండా కెనడా క్రికెట్ బోర్డుపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) మరికొన్ని విచారణలు కూడా జరుపుతోంది. జాతీయ జట్టులో కొందరు ఆటగాళ్లను ఎంపిక చేయాలని కోచ్ ఖుర్రం చౌహాన్, బోర్డు సభ్యులు ఒత్తిడి చేసినట్లుగా ఉన్న ఒక ఫోన్ కాల్ ఆడియో గతంలో లీక్ అయింది. దీనిపైనా ఏసీయూ దర్యాప్తు చేస్తోంది.

ఈ ఆరోపణలపై ఐసీసీ ఇంటిగ్రిటీ యూనిట్ జనరల్ మేనేజర్ ఆండ్రూ ఎఫ్‌గ్రేవ్ స్పందించారు. ఈ డాక్యుమెంటరీ విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే విచారణ దశలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఈ ఆరోపణలతో కెనడా క్రికెట్ బోర్డుతో పాటు టీ20 ప్రపంచకప్ పారదర్శకతపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Dilpreet Bajwa
Canada cricket
T20 World Cup
match fixing
ICC investigation
corruption
Khurram Chauhan
cricket corruption
Canada vs New Zealand
anti corruption unit

More Telugu News